సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ సమీక్ష: సాంకేతిక పరికరాల పంపిణీ

రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు నేరేడ్మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో రాచకొండ స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ గారు స్పెషల్ బ్రాంచ్ పనితీరును ప్రశంసిస్తూ, వారు క్షేత్రస్థాయిలో సిబ్బందికి మరియు ఇతర పోలీస్ విభాగాలకు అవసరమైన సహకారం అందిస్తూ నేరశాతం తగ్గించేందుకు కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్, మరియు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల జారీ వంటి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.

సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన సాంకేతిక పరికరాలు అందించడం ద్వారా విధి నిర్వహణ సులభతరం చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ బ్రాంచ్ జోన్ల అధికారులకు టాబ్లెట్స్, లాప్ టాప్స్, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలను అందజేశారు. కమిషనర్ గారు సిబ్బంది పనితీరు మరింత మెరుగుపరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిపి కరుణాకర్, ఏసిపి శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు అశోక్, మన్మోహన్, స్వామి, వెంకటేశ్వర్లు, మహేందర్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.