శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు మంత్రి సురేఖ గారికి అందించిన ప్రత్యేక ఆహ్వానం

అటవీ, పర్యావరణ, దేవాదయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. అదే సమయంలో అమ్మవారి శేష వస్త్రాలు, చీరె సమర్పించి తీర్థప్రసాదాలను అందించి, వేదాశీర్వచనం చేసారు.

తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆలయ ఈవోను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రసాద్ స్కీం నిధులతో నిర్మించిన నూతన భవనంలో భక్తులకు అన్నదానం, వసతీ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. జోగులాంబ దేవాలయంలో అక్టోబర్ 3 నుండి 12 వరకు జరగబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున మంత్రి సురేఖ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.