రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు – భూ దందాలు, విచారణ డిమాండ్: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోందని ఆరోపించారు.

కేంద్ర నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించారని చెప్పారు. ఉత్తర భాగం అలైన్ మెంట్ ఆమోదం పొందిందని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. దక్షిణ భాగం అలైన్ మెంట్ కూడా గతంలోనే ఖరారు చేశారని, కానీ ఇంకా ఆమోదముద్ర పొందాల్సి ఉందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గత తొమ్మిది నెలల నుంచి స్వలాభం ఉందా లేదా అని పరిశీలిస్తోందని, స్వలాభం కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దక్షిణ భాగం భూసేకరణ, రోడ్డు కోసం రాష్ట్రం 2500 కోట్లు, కేంద్రం 12,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారని ఆరోపించారు. సాగర్ రోడ్ లో గొల్లపల్లి గ్రామం నుంచి గ్రామానికి, శ్రీశైలం రోడ్డులో దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరానికి మార్పు చేశారని చెప్పారు. ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్ మెంట్ మారుస్తున్నామనే వ్యాఖ్యలపై, పాత అలైన్ మెంట్ తో కొత్త అలైన్ మెంట్ మధ్య దూరం పెరిగిందని తెలిపారు.

400 ఎకరాల కుందారం భూములను పేదలు సాగు చేసుకుంటున్నారని, రాజ వంశీయులతో బేరం చేసుకొని పేదలను వెలగొట్టి కాంగ్రెస్ నేతలు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. జనవరి నుంచే పేద రైతుల నుంచి కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారని, అలైన్ మెంట్ మార్పు వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆరోపించారు.

అలైన్ మెంట్ మార్పు పై శ్వేత పత్రం విడుదల చేయాలని, సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కోరారు. సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, భాజపా ఒక్కటే అని భావించాల్సి వస్తుందని అన్నారు.

ప్రభుత్వం అలైన్ మెంట్ మార్పు చేయాలనుకుంటే, పూర్తి పారదర్శకంగా, పేదలకు మంచి పరిహారం ఇచ్చి చేయాలని డిమాండ్ చేశారు.