భారత్-భూటాన్ సరిహద్దులో నేడు చారిత్రక పరిణామం చోటు చేసుకోనుంది. అసోంలో ఉన్న దర్రంగా వద్ద ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభం అవుతుంది. ఈ చెక్ పోస్ట్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవనుంది.
ఈ కార్యక్రమానికి అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందించిన అసోం డీజీపీ, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, బండి సంజయ్, భూటాన్ ప్రధాని, అసోం గవర్నర్ కలిసి ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభించనున్నారు.
ఈ చెక్ పోస్టు ప్రారంభం కావడంతో భారత్-భూటాన్ మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఇరు దేశాల మధ్య లాజిస్టిక్ ఖర్చులు తగ్గిపోతాయి, దీని ద్వారా ప్రజా సంబంధాలు, వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలు మరింత బలపడతాయి.
భూటాన్ ప్రధాని శెరింగ్ టోబ్‌గే, కేంద్ర మంత్రులు బండి సంజయ్, పవిత్ర మార్గరీటా, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ మరికాసేపట్లో అసోం సరిహద్దులో ప్రసంగించనున్నారు.